Sri Bhadrachala Seetharamaswamy Suprabhatham In Telugu | శ్రీభద్రాచల సీతారామస్వామి సుప్రభాతం | Stotra Ratnalu స్తోత్రరత్నాలు

శ్రీభద్రాచల సీతారామస్వామి సుప్రభాతం

రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

1. శ్రీకరంబగు దివ్యాంధ్ర సీమలోన తెల్లవారెను చీకటి తెరలుతొలగె సకలజీవులు మేల్కాంచె సన్నుతింప భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

2. బ్రహ్మ, యీశ్వర యింద్ర దిక్పతులు వచ్చి ఆలయంబున నీకు సేవలు చేయ వేచియుండిరి కనుమయ్య వేడ్కమీర భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

3. తల్లి సీతమ్మ మాయమ్మ ధరణి పుత్రి స్వామి హృదివాసి సౌభాగ్య సర్వలక్ష్మి వాణి, పార్వతి యింద్రాణి వచ్చిరమ్మ భద్రగిరివాస శ్రీరామ పత్ని లెమ్ము

4. నింగితిరుగాడు గ్రహములు నెమ్మితోడ ద్వారమందున నిల్చిరి దర్శనముకు నీపదములు పూజింపగా నెంచినారు భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

5. సప్తమునివరేణ్యులు నీకు స్వస్తిపలుక గురుడు తిథియును, నక్షత్ర వారములను తెలుపపంచాంగము పఠింప నిలిచినారు భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

6. భానుడుదయాద్రినుదయింప భాసురముగ తనకిరణములు ప్రసరించి ధరణిలోన వెలుగు విరజిమ్ముచుండెను వింతగాను భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

7. హనుమ, సుగ్రీవ, జాంబవంతంగదాది వానరప్రముఖులు నీదుపాదయుగము భక్తితోడను సేవించ వచ్చినారు భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

8. దేవ సాకేతపురనాధ! దివ్యరూప! ధర్మముద్ధరించెడి అవతారమూర్తి శిష్టరక్షకా! దనుజవిచ్ఛేదకార భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

9. నిన్ను వర్ణించ కీర్తనల్ ఎన్నగాను భక్తిరసమయ భావంబు భాసిలంగ రామదాసు త్యాగయ్యలు వ్రాసినారు భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

10. అడవిని శిలయై యున్న అహల్య నీదు పదము సోకగా నెలత రూపంబునొందె అట్టి నీపాదయుగముల నంటనిమ్ము భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

11. కడలిదాటగా వారధి కట్టువేళ చిన్న వుడత సాయంబును చేసెనంచు నెమ్మితో దానివీపును నిమిరినావు భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

12. మొదట శ్రీరామ వ్రాయుటనాదిగాను తెలుగువాడల అలవాటు కలిగెనయ్య వ్రాసినది శుభప్రదముగా వాసికెక్కు భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

13. శక్తివంతుడవగు నీకు సాయమేల? వానరులుకూడ నిను కొల్చు భాగ్యమటుల కలుగచేసితివది నీదు కరుణగాదె? భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

14. నీహృదియె స్థావరంబుగా నిత్యముండు సీతనెడబాసెనని వెత జెందినావు ఏమినీమాయ తెలియగా ఎవరితరము? భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

15. అవని శ్రీరఘురాముడై అవతరించి పూర్ణమానవమూర్తిగా స్పూర్తినొంది సుఖముదు:ఖాది గుణముల సోలినావు భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

16. తేనెకన్నను మిన్నయౌ తీపిదనము యుండె నీనామమందున నిండుగాను రామనామము స్మరియింతు రమ్య మలర భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

17. పాడిపంటలువృద్ధిగా బరగుచుండ పల్లెసీమల సౌందర్యపటిమగనగ ప్రకృతిలో అణువణువును పరవశించె భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

18. లేత గడ్డిపై మంచుకురియ, అదియును సూర్యకాంతిలో తళుకుల సొంపులీన కరగిపోకుండ అద్దాని గాంచవయ్య భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

19. తల్లిదరిచేరి పాలను త్రాగగాను లేగదూడలు ఆత్రాన సాగిరాగ గోవు తమకాన కనుమోడ్చి కూర్మి నెరపె భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

20. తెనుగునాటను గౌతమీతీరమందు సాధ్విసీతమ్మ, లక్ష్మణస్వామితోడ వెలసితివిగ భక్తులు నిన్ను వినుతిజేయ భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

21. అదిగొ పక్షులు గూళ్ళను వదలిపెట్టి మేతవెతుకగాను సుదూరమేగునపుడు కిలకిలారావముదముగా సలుపుచుండె భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

22. నవ్యపోకడల జనత నడుచుగాక! నాస్తికత్వ వాదనకిక స్వస్తి పలుక విశ్వమంత నీవేయను విధము జూప భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

23. ఆర్ష సంస్క్రత నిలయమీ ఆంధ్రభూమి పాడిపంటలతో నిండు పసిడినేల అట్టిరాష్ట్ర రక్షక! పూజలందుకొనగ భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

24. కాలనాధభట్ట బిరుదు కలిగియున్న పావనంబగు వంశాన బరగినాడ వ్రాసితిని సుప్రభాతంబు భక్తితోడ భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

25. సుప్రభాతము పాడగా విప్రవరులు ఆలయార్చక బృందములరగుదెంచి వేచియున్నారు ! గీతము వినగదేవ భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

మంగళహారతి

అవని ఆదర్శ దంపతులెవరనంగ అరయగాను సీతారాములనుచు జనులు వేయినోళ్ళను వినుతింత్రు వేడ్కమీర ఆశ్రితవరద శ్రీరామ హారతిదిగొ

తనకుమార్తెనిచ్చెడివేళ జనకరాజు కనకపుంపళ్ళెరంబున కడిగినట్టి గంగప్రవహించు పదములు గాంచనిమ్ము ఆశ్రితవరద శ్రీరామ హారతిదిగొ

తనివితీరదు నిన్ను స్తోత్రంబుచేయ ఆలయంబున వెలసిన ఆర్యపుత్ర మంగళంబగు నిత్యంబు మధురహాస ఆశ్రితవరద శ్రీరామ హారతిదిగొ

ధరణి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ కృష్ణ బుద్ధ కల్క్యావతారముల్ పొందినట్టి ఆశ్రితవరద శ్రీరామ హారతిదిగొ

శాంతి సుఖము కలుగుగాక జనులకెపుడు విశ్వమానవ శ్రేయస్సు వెలయుగాక చిత్తశుద్ధి ప్రేమాంజలి చేతుమయ్య ఆశ్రితవరద శ్రీరామ హారతిదిగొ

స్వస్తి

స్వస్తి! జగతి నెల్లెడల ప్రశాంతి వెలయ స్వస్తి! ఆలయనిర్వాహకాస్థికులకు స్వస్తి! మనసార నినుగొల్చు భక్తతతికి భద్రగిరివాస! శ్రీరామచంద్ర ! స్వస్తి!!

ఓం శాంతిశ్శాంతిశ్శాంతి:

Tags : భద్రాచల సీతారామస్వామి సుప్రభాతము, సుప్రభాతములు, స్తోత్రరత్నాలు, Stotra Ratnalu, Sri Bhadrachala Seetharamaswamy Suprabhatham, Sri Rama Suprabhatam, Bhadrachala Sri Rama Suprabhatam

Comments